బర్త్ డే కేక్‌లో మత్తుమందు కలిపి ముగ్గురు స్నేహితులు సామూహిక అత్యాచారం

శుక్రవారం, 16 అక్టోబరు 2020 (15:57 IST)
ఓ యువతిని  పుట్టిన రోజు పార్టీ అంటూ తీసుకెళ్లి  సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు యువతి సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తన ఇంటికి సమీపంలో నివాసం ఉండే జోసెఫ్‌, నవీన్‌రెడ్డి, రాములు ముగ్గరు ఆ యువతకి  స్నేహితులుగా ఉండేవారు.
 
అయితే తన పుట్టినరోజు అని, నవీన్‌, రాములుతో కలిసి వేడుక చేసుకుందామని జోసెఫ్ ప్రతిపాదించాడు. స్నేహితులన్న నమ్మకంతో ఆ యువతి సరేనంది. కళాశాల నుంచే నలుగురూ ఓ హోటల్‌కు వెళ్లి పుట్టినరోజు వేడుకు చేసుకున్నారు. యువకులు ముగ్గురూ పథకం ప్రకారం ముందుగా కేక్‌పై మత్తుమందు చల్లారు. అందరం కలిసి తిందామని యువతి అనగా.. ముందు నువ్వే తినాలంటూ జోసెఫ్‌ ఆమెకు తినిపించాడు. కొద్దిసేపటికే ఆమె మత్తులోకి వెళ్లింది.
 
ఆ తర్వాత ముగ్గురూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించిన యువకులు ఆమెను ఆటోలో ఇంటికి పంపించేశారు. ఆరోజు నుంచి బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈనెల 11న అపస్మారకస్థితికి వెళ్లగా తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు యువతి తల్లిదండ్రులు. ఘటన సైబరాబాద్‌ పరిధిలో జరగడంతో జీరో ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేసి సైబరాబాద్‌ పోలీసులకు కేసు బదిలీ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. 
 
కాగా కేకులో మత్తు మందు ఇచ్చి యువతిపై అత్యాచారం చేసిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.   నిందితులు ముగ్గురు దగ్గర నుంచి మరిన్ని వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు