గుట్టు విప్ప‌ని కుట్ర‌... ఎం.ఐ.ఎం. కాపాడింద‌ట‌, కేసీఆర్ ఇప్పుడు చెప్పాలంటూ...

గురువారం, 17 నవంబరు 2016 (15:36 IST)
హైద‌రాబాద్ : నేను సీఎం కాకుండా పెద్ద కుట్రే జ‌రిగింది... దాని నుంచి న‌న్ను ఎం.ఐ.ఎం. కాపాడింద‌ని... తెలంగాణా సీఎం కేసీఆర్ బాంబు పేల్చారు. 2014 ఎన్నికలు గెలిచినా తాను ముఖ్యమంత్రి కాకుండా కొంతమంది నాయకులు కుట్ర పన్నారని ఆయన అన్నారు.
 
మీకొక రహస్యం చెబుతా... ఇంతవరకు దీనిని బయటపెట్టే అవకాశం రాలేదు. నేనింకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే చంద్రబాబు బీకరంగా ఒక మాట అన్నారు. బెర్లిన్ గోడ కూలిపోయాక జర్మనీలు రెండు కలసిపోయినట్లు తొందర్లోనే ఆంధ్ర తెలంగాణా మళ్లీ కలసిపోతాయని... తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్  ప్రెసిడెంట్ అనే పెద్ద మనిషి భట్టి విక్రమార్క టిఆర్ ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నాడు. 
 
కాబోయే ముఖ్యమంత్రిని కాబట్టి పోలీసు వర్గాలు నాకీ విషయాన్ని వెల్లడించాయి’ అని కెసీఆర్ తనలోనే చాలా కాలంగా దాచుకున్న రహస్యాన్ని బయటపెట్టారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ త‌న‌ను క‌లిసి ఈ కుట్ర గురించి చెప్పాడని ముఖ్యమంత్రి చెప్పారు. ’నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకుండా అడ్డుకుని తెలంగాణాలో రాష్ట్రపతి పాలన వచ్చేందుకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేశాయి. అపుడు నాకు అండగా నిలిచింది ఎంఐఎం’ అని వెల్ల‌డించారు. 
 
అయితే, ఆ కుట్ర క‌థాక‌మామిషు ఏంటి... ఎం.ఐఎం. కి అది ఎలా తెలిసింది...వాళ్ళు కేసీఆర్‌ను ఎలా ర‌క్షించారు... అనేది వెల్ల‌డించాల‌ని ఇపుడు బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణా ఏర్పాటును ఎపుడూ సమర్థించని  ఎంఐఎంతో ఏ ప్రాతిపదికన ముఖ్యమంత్రి కెసిఆర్ స్నేహం చేస్తారో, ఆ పార్టీని ఎందుకు అంత మిత్రపక్షంగా ప్రేమిస్తున్నారో ప్రజలకు కూడా చెబితే సంతోషిస్తారని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి