సీఎం కేసీఆర్ ఈ నెల 22న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వెళ్లనున్నారు. యాదాద్రి నుంచి సీఎం ఫాం హౌస్‌కు వెళ్లే దారిలో ఈ గ్రామం ఉంది. స్థానికుల భూముల నుంచి యాదాద్రికి రోడ్డు నిర్మాణం చేశారు. అయితే.. దీనిపై గ్రామస్థులు ఆందోళనలు చేశారు. అంతటా విమర్శలు రావడంతో.. వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు.
కలెక్టర్ వచ్చి అన్ని ఏర్పాట్లు చూస్తారని సీఎం చెప్పారు. సీఎం ఆదేశాలతో.. వాసాలమర్రికి వెళ్లారు కలెక్టర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత. సామూహిక భోజనాలు, సభ జరిపేందుకు ఏర్పాట్లను పరిశీలించారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రిని కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం విదితమే. గతేడాది ఈ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా రూ.100 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఎర్రవల్లి తరహాలో వాసాలమర్రిని కూడా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మళ్లీ దత్తత గ్రామానికి వెళ్తున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో వాసాలమర్రిలో ఏర్పాట్లను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. సామూహిక భోజన ప్రదేశం, గ్రామ సభ నిర్వహణకు పెద్ద ఖాళీ స్థలాన్ని చూడాలని సర్పంచ్ అంజయ్యకు కేసీఆర్ సూచించారు. దీంతో సర్పంచ్ చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.