తెలుగు రాష్ట్రాల్లో గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ పలు ప్రాంతాలు, కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. మరోవైపు, వరద బాధిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం పర్యటిస్తున్నారు. ఇందుకోసం ఆయన భద్రాచలంకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు మంత్రి పువ్వాడకు శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఆ తర్వాత గోదావరి శాంతించాలని సీఎం కేసీఆర్ శాంతి పూజ చేశారు.
వరద ప్రాంతాల పరిశీలన కోసం శనివారం రాత్రికే వరంగల్ చేరుకున్న కేసీఆర్... రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం వరద ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉంది. అయితే ఏరియల్ సర్వేకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వేను అధికారులు రద్దు చేశారు. ఈ క్రమంలో రోడ్డు మార్గ మీదుగానే కేసీఆర్ వరద ప్రాంతాల పర్యటన మొదలైంది.
ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతానికి కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా అధికారులు స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం వరంగల్‌లో బయలుదేరిన కేసీఆర్ ములుగు, ఏటూరు నాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు.
ఈ సందర్భంగా గోదావరి నదికి కేసీఆర్ ప్రత్యేక శాంతి పూజలు చేశారు. నదిలో వరద ప్రవాహాన్ని పరిశీలించారు. మార్గమధ్యలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ సాగిన కేసీఆర్... ఆయా ప్రాంతాల్లో ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. మరికాసేపట్లో వరద ప్రాంతాల పరిశీలనను పూర్తి చేయనున్న కేసీఆర్... వరద నష్టంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు.