తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల తొలి రోజున ఇటీవల చనిపోయిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డిలకు సభ ఘనంగా నివాళులు అర్పించారు. వీరిద్దరి మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు.
క్రమశిక్షణ, కఠోర శ్రమ అంకితభావంతో అంచలంచలుగా ఎదిగారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థాయిలో నిలబెట్టారు. ప‌్రపంచంలోనే ప్రణబ్ ముఖర్జీ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. మహోన్నత రాజనీతిజ్ఞుడిగా మెలిగారు. రాజకీయాల్లో ఆయన పాత్ర చిరస్మరణీయమంటూ కేసీఆర్ కొనియాడారు.
ముఖ్యంగా, మిత్ర పక్షాలను కలుపుకుని పోవడంలో విశ్వసనీయుడిగా ఆయన పేరొందారు. ప్రతిపక్షాలను సిద్ధాంతపరంగా మాత్రమే విమర్శించేవారు. వ్యక్తిగతంగా విమర్శించే వారు కాదు. జఠిల సమస్యను సామరస్యంగా పరిష్కరించే వారు ప్రణబ్... దేశ 13వ రాష్ట్రపతిగా అత్యున్నత పదవి అలంకరించిన, జాతి నిర్మాణంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2019లో భారతరత్న అవార్డును స్వీకరించారన్నారు.
పలు రాష్ట్రాల అవతరణలకు సహాయ పడిన వారిగా కాకుండా, రాష్ట్ర విభజన బిల్లుపై ముద్ర వేసి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.