భారతీయ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తెరాస : సీఎం కేసీఆర్ వెల్లడి

బుధవారం, 5 అక్టోబరు 2022 (16:35 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనే ఆయన భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ పార్టీగా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం జరిగిన తెరాస సర్వసభ్య సమావేశంలో ఏక వాక్య తీర్మానం చేసి ఆమోదించారు. జాతీయ పార్టీ ఆవిర్భావంపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయగానే పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఆ తర్వాత తెరాస పేరును బీఆర్ఎస్‌గా మార్చినట్టు భారత ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. 
 
కాగా, బుధవారం సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య జరిగింది. ఇందులో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ఏక‌వ‌చన తీర్మానాన్ని ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌వేశపెట్టారు. దీనికి స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి హాజ‌రైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. 
 
ఆ తర్వాత మ‌ధ్యాహ్నం 1.19 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ ఇక‌పై బీఆర్ఎస్‌గా మార‌నుంది. ఈ మేర‌కు తెలంగాణ భ‌వ‌న్ నుంచి మీడియాకు ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. అలాగే, టీఆర్ఎస్‌ను భార‌త్ రాష్ట్ర స‌మితిగా గుర్తించాలంటూ భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు తెరాస ప్రధాన కార్య‌ద‌ర్శి పేరిట రాసిన‌ లేఖను కూడా మీడియాకు విడుద‌ల చేశారు.
 
జాతీయ పార్టీ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబ‌రాలు మొద‌లు పెట్టారు. కాగా, సాయంత్రం జ‌రిగే మీడియా స‌మావేశంలో సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ విష‌యంలో మ‌రిన్ని వివ‌రాలను వెల్ల‌డించబోతున్నారు. ఈ స‌మావేశంలో క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి, జేడీఎస్ నేత కుమార‌స్వామి, వీసీకే అధినేత తిరుమాళవన్‌తో పాటు క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుకు చెందిన ప‌లువురు నాయ‌కులు పాల్గొనే అవ‌కాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు