న్యూయార్క్ దుస్థితి చూశారు కదా... లాక్‌డౌన్ పొడగించాల్సిందే : కేసీఆర్
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (20:55 IST)
దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను పొడగించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అగ్రరాజ్యం అమెరికా, న్యూయార్క్ మహానగరం దుస్థితిని మనం కళ్లారా చూస్తున్నాం.. న్యూయార్క్‌లో శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. అదే పరిస్థితి మనకు వచ్చివుంటే.. మనమైతే ఆగమయ్యేవాళ్లం. కోట్ల మంది చనిపోయేవారు అని చెప్పుకొచ్చారు.
ప్రగతి భవన్‌లో కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌పై అత్యున్నత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామన్నారు. లాక్‌డౌన్ ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచిదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశానికి లాక్‌డౌన్ తప్ప వేరే మార్గం లేదన్నారు. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత లాక్‌డౌన్ ను పొడిగించాలని ప్రధాని మోడీని కోరుతానని చెప్పారు.
ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా నష్టపోక తప్పదన్నారు. ప్రజలను బతికించుకోవాలంటే లాక్‌డౌన్ తప్ప వేరే మార్గం లేదు. ఒక వేళ లాక్‌డౌన్ సడలిస్తే పరిస్థితి ఏంటి? అని సీఎం ప్రశ్నించారు. మళ్లీ గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వస్తే ఎవరు జవాబుదారీ అని సీఎం అడిగారు. లాక్‌డౌన్ సడలించడమంటే అంత ఆషామాషీ కాదు. లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనని ప్రధానికి చెప్పాను అని తెలిపారు.
ఈ కరోనా వైరస్ అనేది ప్రపంచానికి వచ్చిన పీడ. ఒక్క కుటుంబానికో, జాతికో రాలేదు. 22 దేశాలు పూర్తిగా 100 శాతం లాక్‌డౌన్ చేశాయి. జపాన్, సింగపూర్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కొలంబియా, అర్జెంటీనా, నేపాల్‌తో పాటు మరిన్ని దేశాలు మన పద్ధతిలోనే లాక్‌డౌన్ చేశాయి. మరో 90 దేశాలు పాక్షికంగా లాక్‌డౌన్ చేశారు. మన రాష్ట్రం మంచి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సమాజాన్ని బతికించుకున్నామంటే లాక్‌డౌన్, స్వీయ నియంత్రణ వల్లే అయిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం న్యూయార్క్‌ను చూస్తే శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. అలాంటి దుఖం ఎవరికి సంభవించకూడదు. మనమైతే ఆగమయ్యేవాళ్లం. లాక్‌డౌన్ వల్లనే పరిస్థితిని కంట్రోల్ చేయగలిగామని సీఎం కేసీఆర్ చెప్పారు. లాక్‌డౌన్ వల్లే కరోనా వైరస్‌ను అదుపు చేయగలిగామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్‌తో చనిపోయిన వారంతా మర్కజ్ వెళ్లొచ్చిన వారేనని సీఎం పేర్కొన్నారు.
ఈ జబ్బు మన దేశంలో పుట్టింది కాదు. వేరే దేశంలో పుట్టిన జబ్బు ట్రాన్స్‌మిట్ అయింది. ఈ వైరస్‌ను అరికట్టేందుకు అన్నింటిని లాక్‌డౌన్ చేశారు. లాక్‌డౌన్ వల్ల మన దేశం, రాష్ట్రం అద్భుతమైన గణనీయమైన విజయం సాధించింది. ఈ విషయంలో సందేహం అవసరం లేదు అని సీఎం స్పష్టంచేశారు.
దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4314గా ఉండగా, మరణించిన వారి సంఖ్య 122 ఉందన్నారు. ఇతర ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఎంతో సురక్షితంగా ఉంది. ఈ విషయం తాను చెప్పడం లేదు. ఇండియా మంచి పని చేసింది అని ఇంటర్నేషల్ జర్నల్స్ ప్రకటించాయి. ఐక్యతను ప్రదర్శించి ఇండియా మంచి పని చేసిందని ఇతర దేశాల అధినేతలు ప్రశంసించారు.
లాక్‌డౌన్ విధించకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే వాళ్లం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం మనది. అమెరికావంటి దేశం భయంకరమైన పరిస్థితిలో ఉంది. న్యూయార్క్‌లో శవాల గుట్టలు ఉన్నాయి. అక్కడ బాధలు హృదయవిదారకంగా ఉన్నాయి అని సీఎం తెలిపారు. న్యూయార్క్‌లో శవాన్ని ముట్టుకునే వారు ఎవరూ లేరు. అంత పవర్ ఉన్నా దేశం అయినప్పటికీ కూడా దయనీయమైన స్థితిలో ఉంది. ఆ పరిస్థితి మనకు ఉంటే కోట్ల మంది చనిపోయేవారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు రెండు దశలను అమలు చేశాం. తొలి దశలో విదేశాల నుంచి వచ్చిన వారు, వారి ద్వారా కొంతమందికి ట్రాన్స్‌మిట్ అయిందన్నారు. మొదటి దశలో మొత్తం 50 మందికి కరోనా సోకితే ఇందులో 30 మంది విదేశాల నుంచి వచ్చిన వారు. మిగతా 20 మంది వారి కుటుంబ సభ్యులేనన్నారు.
మొదటి దశలో ఇప్పటి వరకు 25,937 మందిని క్వారంటైన్ చేసి ప్రభుత్వ పర్యవేక్షణలో పెట్టుకున్నామని సీఎం చెప్పారు. ఈ 50 మందిలో ఎవరూ చనిపోలేదు అని కేసీఆర్ వివరించారు. వీరిలో 35 మంది డిశ్చార్జి అయ్యారు. మిగతా వారు కూడా ఎల్లుండి లోపు డిశ్చార్జి అవుతారు. క్వారంటైన్‌లో ఉన్న వారిని కూడా 9వ తేదీ లోపు డిశ్చార్జి అవుతారు. సంతోషంగా వాళ్ల ఇండ్లకు పోతారు. ఇది మొదటి ఫేజ్ అని సీఎం తెలిపారు.
ఇక రెండో దశలో వచ్చిన కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చినవేనని గుర్తుచేశారు. నిజాముద్దీన్ సంఘటన దేశాన్ని అతలాకుతలం చేసింది. మర్కజ్ కేసుల్లో భాగంగా పాతవి, కొత్తవి కలిపి.. 364 మందికి సోకింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 11 మంది కరోనాతో చనిపోయారు. వీరంతా మర్కజ్ వెళ్లొచ్చిన వారేనని తెలిపారు. గాంధీలో 308 మంది చికిత్సలో ఉన్నారు.
మర్కజ్ నుంచి వచ్చిన 1089 మందిని గుర్తించాం. ఇంకో 30 మంది ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 173 మందికి కరోనా సోకగా.. వీరి నుంచి మరో 93 మందికి సోకింది. మర్కజ్ వారిని గుర్తించే పనిలో ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా ప్రజలు సహకరిస్తున్నారు. ఇంకా సహకరించాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.