హైదరాబాద్, సోమాజిగూడ రాజ్‌భవన్ ఎదురుగా గల ఎంఎస్ మక్తా ప్రధాన రహదారి గోడలు ఇపుడు అందమైన పెయింటింగ్‌లతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి. నిన్నటిదాక మాసిపోయి ఉన్న ఈ గోడలు నేడు పలు రకాల వన్యప్రాణులు, జీవవైవిద్య చిత్రాలతో పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పై అందమైన పెయింటింగ్‌లు వేసే ప్రక్రియను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ప్రధాన వీధులకు కళాత్మక సొబగులు అద్దేందుకు జీహెచ్ఎంసీ చేపట్టిన పెయింటింగ్‌లలో భాగంగా సోమాజిగూడ ఎంఎస్ మక్తా ప్రహరీగోడపై జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగంచే తెలంగాణలోని పలు అటవీ వన్యప్రాణులు, జీవవైద్యాన్ని ప్రతిభింబించే అనేక చిత్రాలను పెయింటింగ్ చేయించడం నగరవాసులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. దీంతో పాటు ఇటీవల నక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో నవంబర్ 1 నుండి 24వ తేదీ వరకు నిర్వహించిన స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్‌లో భాగంగా నక్లెస్‌రోడ్ వెంట ఉన్న గోడలపై, భవనాలపై ఆధునిక, చారిత్రక చిత్రాలను పెయింటింగ్ చేయడంలో జీహెచ్ఎంసి సహకరించింది.
సోమాజిగూడ ఫ్లైఓవర్, పీపుల్స్ ప్లాజా, ఎంఎస్ మక్తా వైపు ఉన్న ప్రహరీగోడలు, భారీ భవనాలపై వేసిన చిత్రాలు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులతో పాటు నగరవాసులను విశేషంగా ఆకట్టుకోవడంతో రాజ్‌భవన్ మార్గంలో ఈ చిత్రాలను వేసే ప్రక్రియను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. సోమాజిగూడ ఫ్లైఓవర్‌పై గ్రామీణా వాతావరణం తెలియజేసే పెయింటింగ్‌లు, నక్లెస్‌రోడ్ సమీపంలో ఆధునిక జీవనాన్ని ప్రతిబింభించే పెయింటింగ్‌లను వేయగా రాజ్‌భవన్ ఎదురుగా పూర్తిగా వన్యప్రాణుల పెయింటింగ్‌లను జీహెచ్ఎంసి వేయిస్తోంది.
ఇందుకుగాను జె.ఎన్.టి.యు ఫైన్ఆర్ట్స్ పెయింటింగ్ విభాగం విద్యార్థినీ విద్యార్థులతో వేయిస్తున్నారు. గత రెండు వారాలుగా వేస్తున్న ఈ పెయింటింగ్‌లు మరికొద్ది రోజుల్లో పూర్తి కానున్నాయి. అనంతరం సోమాజిగూడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ప్రహరీగోడతో పాటు అదే మార్గంలో ఉన్న ప్రధాన ప్రభుత్వ భవనాల ప్రహరీగోడలపై కూడా పెయింటింగ్‌లు వేయించడం ద్వారా నగర ప్రధాన రోడ్లకు మరింత శోభను కల్పించనున్నట్టు జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్ధన్ రెడ్డి తెలిపారు.