కరోనా మూడో వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ విషయంలో హెచ్చరిస్తున్నారని, ఇప్పటి నుంచే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
మంగళవారం నాడు ఈ విషయమై ఆయన ఒక ట్వీట్ చేశారు. దేశంలో మూడో కరోనో వేవ్ విషయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశంలో పిల్లల తల్లి తండ్రులకు వెంటనే కరోనో వాక్సిన్స్ టీకాలు వేయించాలని, పిల్లల వ్యాధులకు సంబంధించిన మందుల ఉత్పత్తులను గణనీయంగా పెంచి అన్ని రకాల మందుల కొరత లేకుండా చూడాలని ఆయన సూచించారు.
అలాగే దేశంలో వైద్య సిబ్బందిని సరిపోయేంతగా పెంచాలని, నర్సింగ్ సిబ్బందిని పెంచి వారికి సరైన శిక్షణ, నైపుణ్యం ఇవ్వాలని ఇది ఈ సమయంలో అత్యంత కీలకమైన విషయమని అన్నారు.