అన్ని నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారులు (ROలు) ఫారం-1లో పబ్లిక్ నోటీసును జారీ చేశారు. నామినేషన్లు స్వీకరించే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (AROలు) పేర్లు, రిటర్నింగ్ అధికారి కార్యాలయం అయిన నామినేషన్లు తీసుకునే స్థలం వివరాలను పేర్కొంటారు. అన్ని పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు.
నవంబర్ 10 వరకు 119 నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లను సమర్పించవచ్చు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 చివరి తేదీ. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
రాష్ట్రంలో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), ప్రతిపక్ష కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది. వరుసగా మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఇప్పటికే 116 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో అందరికంటే ముందుంది. కాంగ్రెస్ పార్టీ కూడా 100 మంది అభ్యర్థులను ప్రకటించి ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. బీజేపీ మూడు జాబితాల్లో 88 మంది పేర్లను ప్రకటించింది.