తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే... కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన కొమరయ్య (36), కొమరమ్మ (32) అనే దంపతులు ఉన్నారు. వీరికి ఎల్లమ్మ (10), కోమల (6), అంజలి( 3) అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
అయితే, కొమరయ్య క్షుద్రపూజలతో పాటు.. మంత్రాలు తంత్రాలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు గ్రామస్థులకు కొమరయ్యకు మధ్య గొడవలు జరుగగా, వారిలో కొందరు ఆయనపై భౌతికంగా దాడి చేశారు. దీనికితోడు.. కులపెద్దలు కొమరయ్య కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసింది.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కొమరయ్యతో పాటు ఆయన భార్య కొమరమ్మ తమ పిల్లలకు ముందు ఉరివేసి ఆ తర్వాత తాము ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కులం సభ్యులతోపాటు స్థానికులే ఈ ఆత్మహత్యలకు కారకులంటూ ప్రచారం జరుగుతోంది. గ్రామానికి చేరుకున్న పోలీసులు కుల బహిష్కరణ చేసిన పెద్దలపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.