గోదావరి నీటితో సిద్ధిపేటవాసుల పాదాలు కడుగుతా : టీ సీఎం కేసీఆర్

శనివారం, 4 జులై 2015 (14:28 IST)
గోదావరి నీటితో సిద్ధిపేటవాసుల పాదాలు కడుగుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేటలో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ వచ్చే మూడేళ్ళలో గోదావరి నీళ్ళు సిద్ధిపేటకు తెప్పించి.. ఆ నీటితో ఈ ప్రాంతవాసుల పాదాలు కడుగుతానని చెప్పారు. ఇందుకోసం కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. అక్కడ నుంచే సిద్ధిపేటకు గోదావరి జిలాలు తరలించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు.
 
అంతేకాకుండా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు కిరీటం చేయిస్తానని నా భార్య మొక్కుకుందని, ఈ మొక్కును కూడా త్వరలోనే సొంత డబ్బులతో తీర్చుతానని కేసీఆర్ ప్రకటించారు. ఇకపోతే సిద్ధపేటకు రైలుమార్గం కోసం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, వీటిని మరింత వేగవంతం చేసి త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా సిద్ధిపేట కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. 
 
ఆ తర్వాత తెలంగాణ హరితహారంపై ఆయన మాట్లాడుతూ ‘అందరికీ హరితహారం వందనాలు.. ఆకుపచ్చ దండాలు.. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలి. ఈ కాలం ఎండ కొట్టే కాలమా? వానలు పడే కాలం. మనం దారి తప్పినం. చెట్లు నాటాలని సీఎం చెప్పాలా. ఆంధ్రోళ్ల పాలనలో ఆగమైనం. ఇక ఈ కాలంలో ఎండలు పోవాలె.. వానలు రావాలె.. కోతులు వాపస్ పోవాలె. చెట్లు నాటితేనే వానలు వస్తాయి. హరితహారం ఒక్కరితో విజయవంతం కాదు.. ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి హరితహారంలో పాల్గొంటేనే తెలంగాణ పచ్చగా తయారవుతుందన్నారు. 

వెబ్దునియా పై చదవండి