బ్రహ్మముహూర్తం మీద తిరుగు లేని నమ్మకంతో తెల్లవారుజామున భార్యతో కలిసి గుడికి బయల్దేరిన కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు అనూహ్యంగా కాల్పులకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. బుల్లెట్ గాయాలతో ఆస్పత్రి పాలైన కాంగ్రెస్ నేత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తెల్లవారుజామున ముఖేష్ గౌడ్ దంపతులు ఇంటినుంచి బయలు దేరిన సమయంలోనూ దాడి జరిగిందంటే వారికి బాగా తెలిసినవారే ఈ కాల్పులకు దిగినట్లు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. విక్రమ్ గౌడ్‌పై జరిగిన దాడిలో ఆయనకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆ తర్వాత దుండగులు ఘటనాస్ధలి నుంచి పారిపోయారు. విక్రమ్ నివాసంలోనే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. నెత్తురోడుతున్న ఆయన్ను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో విక్రమ్ గౌడ్ చేయి, పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అత్యవసర విభాగానికి ఆయన్ను తరలించిన వైద్యులు రెండు బుల్లెట్లను శరీరంలో నుంచి వెలికితీశారు. విక్రమ్ ఆరోగ్యపరిస్ధితి నిలకడగా ఉన్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు.
దాడి ఎలా జరిగిందనే విషయాన్ని విక్రమ్ చెప్పలేకపోతున్నారని వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి తర్వాత విక్రమ్ ఇంటికొచ్చారని తెలుస్తోంది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం ఉందని, గుడికి వెళ్దామని భార్యతో చెప్పినట్లు వెల్లడించారు. రెడీ అయి గుడికి బయల్దేరుతున్న సమయంలో దాడి చేసిన దుండగులు విక్రమ్‌ను తీవ్ర గాయపరిచారని చెప్పారు. కుటుంబ కలహాలే కాల్పులకు కారణమని భావిస్తునట్లు తెలిపారు.