ఉరి వేసుకుని ఆత్మహత్య... కాదు ఉరి వేసి చంపేశారు...

సోమవారం, 20 మే 2019 (16:06 IST)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ఆర్బీనగర్‌లో అక్షిత (25) అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అక్షిత ఆత్మహత్యకు భర్త అత్తమామల వేధింపులే కారణం అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. అక్షితను భర్త, అత్తమామలు చంపేసి ఉరి వేసుకున్నట్లుగా చిత్రీకరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
వివారాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపాడు గ్రామానికి చెందిన సంజీవరెడ్డి, శోభ దంపతులకు ఒక కూతురు అక్షిత, కుమారుడు ఉన్నారు. అక్షిత ఎంబీఏ వరకూ చదువుకుంది. శంషాబాద్‌లో రాఘవేందర్ రెడ్డితో 2017 ఆగస్టు రెండో తారీఖున వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లి సమయంలో లాంఛనంగా 30 తులాల బంగారం 20 లక్షల నగదు అప్పజెప్పారు. 
 
ఇది చాలదు అన్నట్టు అక్షిత భర్త రాఘవేందర్ రెడ్డి అదనపు కట్నం కావాలంటూ గత కొంతకాలంగా వేధిస్తుండగా ఈమధ్యకాలంలో ఆరు లక్షల నగదు ఇచ్చినట్టుగా తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. అదనపు కట్నం కోసమే తమ కూతుర్ని భర్త రాఘవేందర్ రెడ్డి అతని తండ్రి అందరు కలిసి హత్య చేసి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లుగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆందోళన చేపట్టారు.
 
తమకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుండి మృతదేహాన్ని తీసికెళ్లేది లేదంటూ ఆందోళన చేస్తున్నారు. సంఘటనా స్థలంలోకి మహిళలతో పాటు వందల సంఖ్యలో అమ్మాయి బంధువులంతా హాజరై ఆందోళన చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆందోళనను విరమింపచేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు