హైదరాబాద్‌లో కుండపోత వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం

సోమవారం, 23 ఆగస్టు 2021 (20:28 IST)
భాగ్యనగరం మరోమరు తడిసి ముద్దయింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా వీఐపీ ప్రాంతాలుగా పేరుగాంచిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ, జగద్గిరిగుట్ట, అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్‌ సహా పలు ప్రాంతాల్లో సోమవారం కుంభవృష్టి కురిసింది. 
 
దీంతో ప్రధాన రహదారులపై వరద నీరు పొంగిపొర్లుతోంది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన జంక్షన్లలో సైతం రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరింది. ఫలితంగా అనేక ప్రాంతాల్లో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. 
 
గతవారం దంచికొట్టిన వానలు.. వారాంతంలో కాస్త తెరపిఇచ్చాయి. కానీ, ఉన్నట్టుండి సోమవారం మధ్యాహ్నం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. భారీ వర్షం కురిసింది. మరోవైపు.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలను పూనుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు