తెలంగాణా రాష్ట్రంలోని జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో సోమవారం నుంచి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి 10 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్‌ను వైద్య ఆరోగ్య శాఖ, కంటోన్మెంట్ బోర్డుతో కలిసి నిర్వహించనుంది.
గ్రేటర్‌లోని 4,846 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్‌లోని 360 వాడలు, కాలనీల్లో ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటికే సిటీలో 70 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగిలిన వాళ్లకు వేసేందుకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లనున్నారు. దాదాపు 200 స్పెషల్ మొబైల్ కొవిడ్ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
జంట నగరాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు బల్దియా ఈ డ్రైవ్ చేపట్టింది. జీహెచ్ఎంసీ సిబ్బంది, ఆశ, అంగన్ వాడీ, ఎంటమాలజీ టీమ్స్.. ముందుగా కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి టీకా వేసుకోని వారి జాబితాలు సేకరించాలని అధికారులు ఆదేశాలిచ్చారు. ఇంటింటికీ వెళ్లి మొబైల్ వ్యాక్సిన్ సెంటర్ల షెడ్యూల్ పాంప్లెట్స్ పంపిణీ చేస్తారు.
వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఆయా కాలనీలు, బస్తీలు 100 శాతం వ్యాక్సినేటెడ్ అని బ్యానర్ ఏర్పాటు చేశారు. ఆయా కాలనీ సంఘాలకు బల్దియా ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేస్తుందన్నారు. ఈ డ్రైవ్‌ను బల్దియా ఉన్నతాధికారులతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు కూడా పర్యవేక్షిస్తారు.