తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు ఆరోగ్యం ఎలావుంది?

బుధవారం, 21 ఏప్రియల్ 2021 (11:44 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
 
ర్రవెల్లి ఫామ్‌ హౌస్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయనకు వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. మంగళవారం రాష్ట్ర మంత్రి కేటీ రామారావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 
మరోవైపు, రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫోన్‌లో పరామర్శించారు. సీఎం త్వరగా కోలుకోవాలని అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజారులను కోరారు. 
 
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. కాగా, ఈనెల 19న సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముఖ్యమంత్రికి కరోనా సోకిందని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు