హెల్త్‌కేర్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించిన రూ.50 లక్షల కరోనా ఇన్సూరెన్స్ పరిహార పథకం (insurance coverage scheme)ని మరో సంవత్సరం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా గొప్ప మంచి నిర్ణయం. ఎందుకంటే... ఈ పథకం గతేడాది కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం. దీని వల్ల కరోనా సేవలు చేస్తూ... ఎవరైనా హెల్త్‌కేర్ వర్కర్ చనిపోతే... ఆ వర్కర్ కుటుంబ సభ్యులకు కేంద్రం రూ.50 లక్షల ఇన్సూరెన్స్ పరిహారం ఇస్తుంది. ఈ పథకం గడవు గత నెలలో ముగిసిపోయింది.
కేంద్రం దాన్ని ఏప్రిల్ 24 వరకూ పొడిగించింది. ఆ తర్వాత దీన్ని ఎత్తివేయాలని అన్ని రాష్ట్రాలకూ లేఖలు పంపింది. ఐతే... దీన్ని మరింతకాలం పొడిగించాలని దేశవ్యాప్తంగా మనలాంటి ఎంతో మంది కోరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా... కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. మరో 6 నెలలైనా పొడిగించాలని కోరింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది అని వివరించింది. దాంతో కేంద్రం మనసు మార్చుకుంది. మరో ఏడాది పొడిగించింది.
ఆ స్కీమ్ ఉంది అనే ఉద్దేశంతోనే చాలా మంది హెల్త్ కేర్ వర్కర్లు ధైర్యంగా కరోనా పేషెంట్లకు సేవలు చేస్తున్నారు. ఇప్పటివరకూ 287 మంది హెల్త్ కేర్ వర్కరు చనిపోగా... వారికి ఈ స్కీమ్ వర్తిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు కేంద్రం రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. చనిపోయిన 287 మందిలో 168 మంది డాక్టర్లు ఉన్నారు. వారంతా కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేస్తూ... కరోనా సోకి చనిపోయారు.
ఇక్కడ హెల్త్ కేర్ వర్కర్లు అంటే... రోడ్లు ఊడ్చేవారు, పారిశుధ్య పనులు చేసేవారు, వార్డ్ బాయ్స్, నర్సులు, ఆశా వర్కర్లు, పారామెడికోలు, టెక్నీషియన్లు, డాక్టర్లు, స్పెషలిస్టులు, ఇతర హెల్త్ వర్కర్లు కూడా వస్తారు. వీళ్లందరికీ ఇన్సూరెన్స్ వర్తించినట్లే. మొదట్లో 90 రోజులకే స్కీమ్ తెచ్చిన కేంద్రం తర్వాత దాన్ని ఏడాది పొడిగించింది. ఇప్పుడు దీన్ని మరో ఏడాది పొడిగించడం సరైన నిర్ణయంగా విశ్లేషకులు చెబుతున్నారు.