అవినీతికి పరాకాష్ట.. లంచం ఇస్తేనే అంత్యక్రియల చెక్కు ఇస్తాం...

బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:36 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అవినీతి రాజ్యమేలుతున్నట్టుగా ఉంది. ఇటీవలి కాలంలో ఈ రాష్ట్రంలో అవినీతి బకాసురులు బయటపడుతున్నారు. ఇప్పటికే పలువురు అవినీతిపరులను అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తాజాగా మరో లంచగొండి అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి తల్లి అంత్యక్రియలకు మంజూరైన చెక్కును అందించేందుకు లంచం డిమాండ్‌ చేసిన అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 
 
హైదరాబాద్‌ నగరంలో మంగళవారం వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, మూసారాంబాగ్‌కు చెందిన ఏ.క్రాంతి కుమార్‌ తల్లి ఇటీవల చనిపోయింది. అంత్యక్రియల నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ.20 వేలు మంజూరయ్యాయి. ఈ నగదుకు సంబంధించి మంజూరైన చెక్కును బాధితుడికి అందజేసేందుకు జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-10, పూల్‌బాగ్‌, ఫలక్‌నుమా, చార్మినార్‌ జోన్‌లో ఆఫీసు సూపరింటెండెంట్‌గా పనిచేసే వాద్యా పూల్‌ సింగ్‌ రూ.5 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. 
 
దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అధికారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్‌ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఏ అధికారి అయిన లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ కాంటాక్ట్‌ నంబరు 1064 కాల్‌ చేసి తెలపాల్సిందిగా సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు