హారతి ఆరిపోయిందని, కుంకుమ కిందపడిందని.. ఇవి అపశకునాలేనని.. తన ఆయుష్షు తీరిందని భావించిన యువతి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ విషయాలు ప్రస్తావిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని ఉరి వేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓం ప్రకాశ్, కబిత(23)లు ఆరేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ నాలుగేళ్ల కూతురుతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లోని పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీలో అద్దెకుంటున్నారు. ఈ నెల 2న ఉదయం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. దీంతో ఓంప్రకాశ్ కూతురిని తీసుకొని డ్యూటీకి వెళ్లిపోయాడు.
డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికొచ్చిన ఓం ప్రకాశ్.. తలుపు ఎన్నిసార్లు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూశాడు. కబిత ఫ్యాన్‌కి ఉరేసుకుని కనిపించడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చిన్నపాటి గొడవ జరిగిందని, అంతకుమించి ఏమీ లేదని అతను ప్రాథమికంగా తెలిపాడు.
కబిత సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారరణ చేపట్టారు. అందులోని సెల్ఫీ వీడియోల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్‌లో వీడియో ఆన్‌చేసి ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా అంతకుముందు హారతి తీసుకుంటుడగా ఆరిపోవడాన్ని, కుంకుమ పెట్టుకుంటుండగా భరణి కిందపడిపోవడాన్ని సైగలతో చూపించింది. అవన్నీ అపశకునాలేనని, తనకు ఆయుష్షు తీరిపోయిందని ఆ వీడియోలో కబిత చెప్పినట్లు పోలీసులు గుర్తించారు.