ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వేరుపడితో తెలంగాణాలో భూముల ధరలు పడిపోతాయన్న ప్రచారం ఉత్తుత్తిదేనని తేలిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది.
2020 నాలుగో త్రైమాసికంలో నైట్‌ఫ్రాంక్ నిర్వహించిన గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్‌లో హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే 122వ స్థానంలో నిలువటం విశేషం. నగరంలో డిమాండ్ పెరుగుతుండటంతో నివాస గృహాల ధరలు పైపైకి పోతూనే ఉన్నాయి. గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో నగరంలో నివాస గృహాల ధరలు అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 0.2 శాతం పెరిగాయని నైట్‌ఫ్రాంక్ వెల్లడించింది.
ధరల పెరుగుదలలో హైదరాబాద్ నగరం దేశంలో మొదటిస్థానం, ప్రపంచంలో 122వ స్థానంలో నిలిచినట్టు నైట్‌ఫ్రాంక్ గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్‌లో తేలింది. హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో బెంగళూరు (129), అహ్మదాబాద్ (143), ముంబై (144), ఢిల్లీ (146), కోల్‌కతా (147), పుణె (148), చెన్నై (150) ఉన్నాయని వెల్లడించింది.
హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ మార్కెట్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లోనూ స్థిరమైన వృద్ధిని ప్రదర్శిస్తుండటం విశేషం. అందువల్లే గతేడాది ప్రతీ త్రైమాసికంలోనూ ఇండ్ల ధరల్లో పెరుగుదల నమోదైంది. నగరంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు బలంగా విస్తరించాయి. ఈ కంపెనీల్లో పనిచేసే నిపుణుల నుంచి ఇండ్లకు భారీగా డిమాండ్ వ్యక్తమవుతున్నది.