హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ అర్బిట్రేషన్‌ సెంటర్‌: జస్టిస్‌ ఎన్వీ రమణ

శుక్రవారం, 18 జూన్ 2021 (07:25 IST)
పారిశ్రామిక, ఐటీ, ఇతర అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో ఏర్పడే వివాదాల పరిష్కారాల కోసం ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను (మధ్యవర్తిత్వ కేంద్రం) హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు.

సింగపూర్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ తరహాలోనే హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుందరేష్‌ మీనన్‌ను కోరినట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌  ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకువెళితే ఆయన సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్న తన కల సాకారం అవుతుందని జస్టిస్‌ ఎన్వీ రమణ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఆర్బిట్రేషన్‌ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ అధికారి ఉంటారని చెప్పారు. అంతర్జాయతీ స్థాయి కంపెనీలు (ఎంఎన్‌సి) ఏర్పాటు కావడం ఒక ఎత్తు, వాటిలో తలెత్తే వివాదాలు సత్వర పరిష్కారం మరొక ఎత్తని, వివాదాలు వెంటనే పరిష్కారమైతేనే పలు ఎంఎన్‌సి సంస్థలు దేశంలో ప్రధానంగా  ఉన్నత ప్రమాణాలున్న హైదరాబాద్‌ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని చెప్పారు.

ఇలాంటి వివాదాలను సింగపూర్‌లోని ఇంటర్నేషన్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లో పరిష్కారానికి ఎంఎన్‌సి సంస్థలు వెళుతున్నాయని వివరించారు. అక్కడికి వెళ్లేందుకు భారీ మొత్తంలో న్యాయవాదులకు ఫీజులు, వాళ్లు ప్రయాణ ఖర్చులు, అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న హోటల్స్‌లో బస వంటివి ఖర్చు అవుతున్నాయని, అదే ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే అవన్నీ ఇక్కడకే వస్తాయని తెలిపారు. 

ప్రపంచ దేశాల్లోని అనేక కోర్టుల్లో లేని ఐటీ సాంకేతికత మన సుప్రీంకోర్టులో వినియోగంలో ఉందని, కేసుల సత్వర పరిష్కారానికి వినియోగిస్తున్న ఆర్టిఫియల్‌ ఇంటిల్‌జెన్సీ సాఫ్ట్‌వేర్‌ కావాలని సింగపూర్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మీనన్‌ కోరారని, ఈ సమయంలో హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదన చేసినట్లు, జస్టిస్‌ మీనన్‌ ఆగస్ట్‌లో భారత్‌కు రానున్నారని, అప్పుడు ఆయనతో చర్చించి ఫలితం సానుకూలంగా వచ్చే కృషి చేస్తానన్నారు. 

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న జస్టిస్ ఎన్వీ రమణ
 
భారత  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శ్రీశైలం రానున్నారు. శుక్రవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.
 
భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.  కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఇటివలే తిరుమల శ్రీవారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు