ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు పూర్తయింది. గురు, శుక్రవారాల్లో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశమైన ఎన్నికల కమిటీ 30 మందితో మొదటి జాబితాను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 శాసన సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వెయ్యిమందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఒక్కో నియోజకవర్గంలో 10-15 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా స్థానాల్లో ఈనెల మొదటి వారంలో పార్టీ నాయకత్వం అభిప్రాయ సేకరణను చేపట్టింది. వాటిపై ఎన్నికల కమిటీ చర్చించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది.
అంతకుముందే.. మొదటి దశలో 30 పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఒక్కో స్థానానికి ఐదు నుంచి ఆరు దరఖాస్తులు టికెట్ కోసం కొన్ని నియోజకవర్గాల్లో ఒకరిద్దరు మాత్రమే పోటీ పడుతుండగా చాలాచోట్ల ఐదు నుంచి ఆరుగురు, మరికొన్ని చోట్ల.. పదుల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. పార్టీకి ఉన్న ఐదు సిట్టింగ్ స్థానాల్లో మాత్రం ఎవరూ పోటీ పడలేదు. రాష్ట్ర పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తున్న నేతలు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు, పార్టీలో కొంత బలంగా ఉన్నవారు కూడా ఈసారి దరఖాస్తు చేసుకోలేదు. తాము కోరుకునే నియోజకవర్గాల్లో టికెట్లపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఇప్పటికే వీరికి స్పష్టమైన హామీ వచ్చినట్లు సమాచారం.
అలాంటి వారిలో శ్రీవర్ధన్ రెడ్డి (షాద్‌నగర్), మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు (వరంగల్ వెస్ట్), యెండల లక్ష్మినారాయణ (నిజామాబాద్ అర్బన్), మనోహర్ రెడ్డి (మునుగోడు), సంకినేని వెంకటేశ్వర్‌రావు (సూర్యాపేట), శ్యాంసుందర్ రెడ్డి (భువనగిరి), పొనుగోటి అరుణకుమార్ (నర్సంపేట), డాక్టర్ కొరదాల నరేష్ (శేరిలింగంపల్లి), కూరపాటి విజయ్‌కుమార్ (పాలకుర్తి), కొప్పు భాష (వికారాబాద్), కీర్తిరెడ్డి (భూపాలపల్లి), పుంజా సత్యవతి (భద్రాచలం), రేష్మ రాథోడ్ (వైరా), ఆర్.లింగయ్య (సత్తుపల్లి), భూక్యా ప్రసాద్ (అశ్వరావుపేట), విజయ రాజు (మధిర) తదితరులు ఉన్నారు. వరంగల్ వెస్ట్ (మార్తినేని ధర్మారావు– రావు పద్మ), మునుగోడు (మనోహర్ రెడ్డి – కడగంచి రమేష్), పరకాల (డాక్టర్ విజయచందర్ రెడ్డి – డాక్టర్ సంతోష్) స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం బుధవారం అభిప్రాయ సేకరణ జరిగింది.
కేవీఎల్‌ఎన్ రెడ్డి – నెల్లుట్ల నర్సింహారావు (జనగాం), కాసం వెంకటేశ్వర్లు – దొంతి శ్రీధర్ రెడ్డి (ఆలేరు), బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి – రమేష్ (కొత్తగూడెం), పురుషోత్తం రెడ్డి – పాడూరి కరుణ (మిర్యాలగూడ) మధ్య కూడా టికెట్ కోసం విపరీతమైన పోటీ నెలకొని ఉంది. మిగతా నియోజకవర్గాల్లో ముగ్గురికంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.
మొదటి జాబితాలో (అంచనా): డాక్టర్ లక్ష్మణ్ (ముషీరాబాద్), కిషన్ రెడ్డి (అంబర్‌పేట), చింతల రాంచంద్రారెడ్డి (ఖైరతాబాద్), రాజాసింగ్ (గోషామహల్), ఎన్ రాంచందర్‌రావ్(మల్కాజిగిరి), ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ (ఉప్పల్), రఘు నందన్ రావు (దుబ్బాక), ఆచారి (కల్వకుర్తి), బండి సంజయ్ (కరీంనగర్), గుజ్జుల రామకృష్ణా రెడ్డి (పెద్దపల్లి), పాయల్ శంకర్ (ఆదిలాబాద్), డాక్టర్ రమాదేవి (ముధోల్), ఆనంద్ రెడ్డి (నిజామాబాద్ రూరల్), వెంకటరమణారెడ్డి (కామారెడ్డి), లింగయ్యదొర కుమారుడు (పిన పాక), కుంజా సత్యవతి (భద్రాచలం), వినయ్ రెడ్డి (ఆర్మూర్), శ్రీధర్ రెడ్డి (పాలేరు), శ్రీవర్ధన్ రెడ్డి (షాద్‌నగర్), రవిశంకర్ పటేల్ (తాండూరు), రతంగ్ పాండురెడ్డి (నారాయణ పేట), మల్లేశ్వర్ (అచ్చంపేట), ఎగ్గెని నర్సింహులు (దేవరకద్ర), వెంకటాద్రి రెడ్డి (గద్వాల్), కీర్తి రెడ్డి (భూపాలపల్లి), డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి (పరకాల), కొండయ్య (మక్తల్), మోహన్ రెడ్డి (మేడ్చల్), రేష్మ రాథోడ్ (వైరా), బాబుమోహన్ (ఆందోల్) ఉండే అవకాశం ఉంది.