జులై చివరి వారంలో జేఈఈ మెయిన్స్‌... ఆగస్టు 5వ తేదీ నుంచి 9 వరకు..?

గురువారం, 17 జూన్ 2021 (14:23 IST)
JEE
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించనున్న అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. సవరించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ షెడ్యూల్‌ను అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి ప్రతిపాదనలు పంపింది.
 
జులై చివరి వారంలో జేఈఈ మెయిన్స్‌ మూడో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అదే విధంగా ఇంజనీరింగ్, వ్యవసాయ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్ ఆగస్టు 5వ తేదీ నుంచి 9 వరకు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. 
 
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ (ICET 2021), లా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్‌ (LAWCET 2021) ఎడ్‌సెట్‌లను నిర్ణీత షెడ్యూల్ మేరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
 
ఎంట్రన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు
పీజీలాసెట్, లాసెట్ 2021 దరఖాస్తుల తుదిగడువును జూన్ 25 వరకు పొడిగిస్తూ అవకాశం కల్పించారు. పీఈసెట్ దరఖాస్తుల గడువును జూన్ 30కి పెంచారు. ఐసెట్ అభ్యర్థులకు దరఖాస్తుల తుది గడువును జూన్ 23 వరకు పొడిగించారు. 
 
ఈ నిర్ణీత తేదీ వరకు అయ్యే దరఖాస్తులకు ఆలస్య రుసుము వసూలు చేయడం లేదని ఆయా సెట్‌ల కన్వీనర్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో దరఖాస్తుల గడువును పెంచి మరింత మంది విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి