గల్లీలో కుస్తీ పడుతూ... ఢిల్లీలో దోస్తీ: జీవన్‌రెడ్డి

బుధవారం, 13 అక్టోబరు 2021 (08:33 IST)
బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు గల్లీలో కుస్తీలు పడుతూ... ఢిల్లీలో దోస్తానా చేస్తున్నాయని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. వీణవంక మండలంలోని మామిడాలపల్లి, ఇప్పలపల్లి, చల్లూరు, ఎలబాక, గంగారం, బొంతుపల్లి, ఘన్ముక్ల గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగరావుకు మద్దతుగా ఇంటింటా ప్రచార నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో వరి వేస్తే ఉరేనని, కేసీఆర్‌ అనడం రైతుల పాలిట శాపమని, ఈ ప్రాంత ప్రజలంతా వరి పండిస్తారని, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పడం సిగ్గు చేటని మండిపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఒకటేనని, తెలంగాణ రైతులను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతమంతా ఎస్సారెస్పీ నీళ్లతోనే మాగానిగా మారిందని, ఇక్కడ వరి పంట తప్ప వేరే పంటలు పండవని, ఇప్పుడు ఇతర పంటలు వేయాలని చెప్పడం సరికాదన్నారు.

గడిచిన మూడేళ్లలో కేసీఆర్‌ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, 57ఏళ్లకే పింఛన్లు ఇస్తానని చెప్పి ఇంత వరకు ఇవ్వలేదన్నారు. నిరుద్యోగభృతి, ప్రభుత్వ ఉద్యోగాల ఊసే లేదని, ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రానున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ చేయి గుర్తుకు ఓటేసీ యువ నాయకుడు బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు