విష్ణు నిర్ణయం ఏంటో?

బుధవారం, 13 అక్టోబరు 2021 (08:20 IST)
ఇప్పటి వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో జరగనటువంటి పరిణామాలు.. తాజాగా జరిగిన ఎన్నికలతో చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల పర్వం ముగిసి ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో గెలిచిన సభ్యులు తీసుకున్న నిర్ణయంతో ఈ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

మంగళవారం ప్రకాశ్ రాజ్ ప్యానల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, గెలిచిన వారంతా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. వారి నిర్ణయంతో ఇప్పుడు ‘మా’లో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ మొదలైంది?.
 
‘మా’ బైలాస్ ప్రకారం ఈసీ మెంబర్స్‌గానీ, ఆఫీస్ బ్యారర్స్‌లోని వారుగానీ ఎవరైనా రాజీనామా చేస్తే.. తిరిగి ఆ పదవులను భర్తీ చేసేందుకు తనకు నచ్చినవారిని తీసుకునే అధికారం ‘మా’ అధ్యక్షుడికి ఉంది. గతంలో కూడా ఇటువంటివి జరిగాయి. ‘మా’ బైలాస్ ప్రకారం అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలున్నాయి.

ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లోని గెలిచిన వారంతా రాజీనామా చేస్తే.. వారి స్థానంలో ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు తనకు నచ్చిన వారిని నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఖాళీలు నింపే అధికారం ఇక విష్ణుదే అనమాట. అయితే ఇలాంటి బైలాస్ ఏమి ఉన్నాయో వాటినే మార్చాలని మొదటి నుండి ప్రకాశ్ రాజ్ ప్యానల్ చెబుతూ వస్తుంది.

దీని కోసం ఓ కమిటీని వేసి మార్పులు, చేర్పులు చేయాలని కోరుతూ వచ్చారు. ఇప్పుడు పూర్తి అధికారం మంచు విష్ణుకే రాబోతోంది కాబట్టి.. దీనిపై మంచు విష్ణు ఏవిధంగా ముందుకు సాగుతాడో చూడాలి..?  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు