శ్రీవారి దర్శనంలో కేసీఆర్ ఫ్యామిలీ.. రెండు రాష్ట్రాల సంబంధాలు గొప్పగా ఉంటాయి

బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (10:01 IST)
భవిష్యత్తులో రెండురాష్ట్రాల సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇరురాష్ట్రాలు సుభిక్షంగా అభివృద్ధి చెందాలని తాను భగవంతుణ్ణి ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. 
 
హైదరాబాద్‌లో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరిస్తామని.. భగవంతుడికి ప్రాంతీయ భేదాలు లేవని ఆయన తెలిపారు. తెలంగాణ తరపున స్వామివారికి మొక్కులు చెల్లించామన్నారు. ఆ రాష్ట్రం నుంచి వచ్చిన తమ కుటుంబసభ్యులకు, మంత్రులకు, సహచరులకు చక్కటి దర్శనం అందిందని తెలిపారు. 
 
అంతకుముందు మంగళవారం రాత్రికే తిరుమలకు చేరుకున్న కేసీఆర్ దంపతులు.. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో కుటుంబ సభ్యులు, తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత కుటుంబసమేతంగా వరాహస్వామిని దర్శించుకున్నారు. వాహన మండపం నుంచి బ్యాటరీ వాహనంలో ఆలయానికి చేరుకున్నారు. 
 
ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుని అనంతరం వకుళామాతను, శ్రీ విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు. తిరుమల శ్రీవారికి కేసీఆర్‌ దంపతులు రూ.5 కోట్లు విలువైన బంగారు అభరణాలను సమర్పించారు. 14.2కిలోల బంగారు సాలిగ్రామహారం, 4.65కిలోల బంగారు కంఠెను ఆయన సమర్పించారు. 

వెబ్దునియా పై చదవండి