తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం కలిగింది. ఏదైనా చిన్న సమస్య వచ్చి ఆసుపత్రి గడప తొక్కితే కొన్ని ప్రైవేటు వైద్యశాలలు రోగుల పట్ల రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారనీ, అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల కొన్ని ఆసుపత్రులపై ఆరోపణలు రాగా, విచారణలో అది నిజమేనని తేలడంతో ఆరు ఆసుపత్రులను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా ఆపరేషన్లు చేస్తే సహించేది లేదనీ, పిచ్చి కుదిరే కార్యక్రమం తాను చేపడుతానంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు లభిస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు పేదలు వెళ్లాల్సిన అవసరం వుండదన్నారు. ఇందులో భాగంగా తాము ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.