తెలంగాణాలో కుటుంబ పాలన ఎక్కువైపోయిందంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలైతే కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, కవితలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాల విమర్శలను పెద్దగా పట్టించుకోని కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ వైపు ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణాలో టిఆర్ఎస్ భారీ విజయం తరవాత కెసిఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే పశ్చిమబెంగాల్‌కు వెళ్ళి మమతా బెనర్జీని కలిశారు కెసిఆర్. ఫెడరల్ ఫ్రంట్‌ను విస్తరించే దిశగా ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో నిజమాబాద్ ఎంపి కల్వకుంట కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పైన నమ్మకం ఏర్పడి దేశ రాజకీయాల్లో కెసిఆర్ చక్రం తిప్పడం ఖాయమని, త్వరలోనే కెసిఆర్ ప్రధాని అయ్యే అవకాశం కూడా ఉందన్నారామె.