సైకిల్ దిగి కారెక్కేందుకు సిద్ధమైన టీడీపీ చీఫ్ ఎల్. రమణ

సోమవారం, 14 జూన్ 2021 (10:11 IST)
తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకీ హీటెక్కుతున్నాయి. ఈటెల ఎపిసోడ్‌తో కరీంనగర్ రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇదే జిల్లాకు చెందిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ సైకిల్ దిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కార్యకర్తలతో చర్చించిన రమణ… భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తమ రాజకీయ ఎదుగుదలకు కారణమైన పార్టీలను ముఖ్య నేతలు వీడుతున్నారు.
 
తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. జగిత్యాలలో మకాం వేసి తన అనుచరుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి భవిష్యత్‌ లేదని పార్టీ మారడమే మంచిదని కార్యకర్తలు సూచించినట్టు తెలుస్తోంది.
 
మరో వారం రోజుల్లో రమణ గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం. తాను పార్టీ ఎందుకు మారుతున్నానో టీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వివరించాలని రమణ అనుకున్నట్టు తెలుస్తోంది. కానీ చంద్రబాబు రమణను కలిసేందుకు విముఖత చూపినట్టు సమాచారం. 
 
రెండు రోజుల్లో ఎల్‌. రమణ మంత్రి ఎర్రబెల్లితో భేటీకానున్నారు. ఇప్పటికే కార్యకర్తలతో సమావేశమైన రమణ…. భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు. టీఆర్ఎస్‌లో చేరికపై ప్రకటన చేసే అవకాశముంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు