ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తెరాస ఎమ్మెల్సీ కవిత పేరు ఉంది. దీంతో ఆమె గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తన పేరును ఇరికించి, జైల్లో పెట్టేందుకు కుట్ర పన్నారన్నారు. జైల్లో పెట్టుకోవచ్చని, ఈ విషయంలో తనకెలాంటి భయం లేదన్నారు.
ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు రావడానికి ఒక యేడాది ముందు ఆ రాష్ట్రానికి ప్రధాని మోడీ కంటే ఈడీ అధికారులు వస్తారని, దీన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని చెప్పారు. మోడీ పాలనలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణాలో వచ్చే డిసెంబరులో ఎన్నికలు ఉండటం వల్లే మోడీ కంటే ముందు ఈడీ వచ్చిందని తెలిపారు.
అందువల్ల తనపైనా, తమ పార్టీకి చెందిన మంత్రులు, నేతల ఇళ్లపై ఈడీ, ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం సహజమేనని చెప్పారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈడీ విచారణకు తాము సహకరిస్తామని చెప్పారు. మీడియాకు ముందే లీకులిస్తూ అలజడి రేపుతున్నారంటూ మండిపడ్డారు.