లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.
ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం తదితర కరోనా నియమావళిని అనుసరించాలని కేబినెట్ కోరింది.
ఈ మేరకు అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ రోజు నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. దీంతో, అన్ని కార్యాలయాలు, షాపులు బస్సులు, మెట్రో సర్వీసులు పూర్తి స్థాయిలో నడవనున్నాయి. అయితే అంతరాష్ట్ర బస్ సర్వీసులపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మే 12న తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.