కేసీఆర్ పుట్టిన తరువాతే అబద్దం, మోసం పుట్టాయి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
శనివారం, 10 ఏప్రియల్ 2021 (14:51 IST)
కేసీఆర్ పుట్టిన తరువాతే అబద్దం, మోసం అనేవి పుట్టాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ అంటేనే దోపిడి, అవినీతికి మారుపేరుగా నిలుస్తారన్నారు.
మాయమాటలు చెప్పి.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కల్వకుంట్ల కుటుంబానికి నాగార్జునసాగర్ ప్రజలు గట్టి బుద్ది చెప్పాలని కోరారు. నేడు సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా అనుముల మండలం మార్లగడ్డగూడెం, పులిమామిడితో పాటు పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ చాలా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్న డబ్బులను ఎన్నికల్లో ఖర్చుపెట్టి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
40 ఏళ్లుగా అవినీతి మచ్చలేని వ్యక్తి.. 20ఏళ్లు మంత్రిగా ఉన్న అక్రమాలకు పాల్పడని జానారెడ్డిపై అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించడంపై మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో రేపో మాపో జైలుకు పోయేవాడు కూడా అవినీతిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు తిరిగి ప్రచారం చేస్తున్న రోడ్లు జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు వేయించినవని తెలిపారు. అంతేగానీ టీఆర్ఎస్ సర్కార్ నాగార్జున సాగర్‌కు మాటలు ఇవ్వడమే తప్ప... ఎప్పుడు అభివృద్ది పనులు చేపట్టలేదని విమర్శించారు.
యువకుల బతుకులు బాగుపడాలని తెచ్చుకున్న తెలంగాణ.. దొరవారి పాలనలో బానిస తెలంగాణగా మారిందన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్న వాటిని
ఉద్యోగాలు రావనే బెంగతో రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు యువకులు ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించిందన్నారు. చివరకు యువతలో ధైర్యం నింపే చర్యలు కూడా కేసీఆర్ తీసుకోవట్లేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు 3016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి బడ్జెట్‌లో కేటాయింపులు జరపలేదన్నారు.
టీఆర్ఎస్ సర్కార్ నాగార్జున సాగర్ అభివృద్దికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ నియోజక వర్గానికి తాగునీరు, సాగునీరును కాంగ్రెస్ హయంలో జానారెడ్డి తీసుకువచ్చారని గుర్తుచేశారు.
అలాగే కాంగ్రెస్ హయంలో శ్రీశైలం సొరంగం పనులు రూ. 1300 కోట్లు 70 శాతం పూర్తి చేస్తే.. ఇప్పటికీ మిగిలిన పనులకు నిధులు విడుదల చేయక జిల్లాకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎలక్షన్ల సమయంలో ప్రాజెక్టు పనులను కుర్చీ వేసుకుని పనులు పూర్తిచేస్తానన్న కేసీఆర్ ఇప్పటికీ ఇటువైపు చూసిన పాపాన పోలేదన్నారు.
టీఆర్ఎస్ సర్కార్ పాలన సరిగా చేయాలంటే జానారెడ్డి లాంటి ప్రశ్నించే వ్యక్తులను అసెంబ్లీకి పంపాలని తెలిపారు. తప్పకుండా జానారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలపించాలని కోరారు.