ఎనిమిదో తరగతి చదివే బాలిక.. భార్యకు చెల్లెలు.. వరసకు మరదల వెంటపడ్డాడు ఓ వ్యక్తి. భార్య కూడదని నిలదీసినా.. తల్లిదండ్రులు బుద్ధి చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకుని పోలీసులకు చెప్పి బుద్ధి చెప్పమన్నారు. కానీ పోలీసులు బుద్ధి చెప్తామని తీసుకెళ్లి.. పోలీస్ స్టేషన్ చితక్కొట్టారు. ఫలితంగా మరదలే కావాలనుకున్న వ్యక్తి మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మోహన్ కృష్ణ అనే యువకుడు తన కుటుంబంతో కలిసి బేగం పేటలో నివసిస్తున్నాడు. ఇతడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య లావణ్య, ఒక బాబు ఉన్నారు. అయితే మోహన్ కృష్ణ కొన్ని రోజులుగా లావణ్యకు వరుసకు సోదరి అయ్యే బాలికపై కన్ను పడింది. ఆ బాలిక ఎనిమిదో తరగతి చదువుతున్నా.. వేధింపులు ఏమాత్రం తగ్గలేదు. తన భర్త చెల్లెలితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన లావణ్య భర్తను నిలదీసింది.
ఇంకా తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల ముందే బాలికను పెళ్లి చేసుకుంటానని మోహన్ కృష్ణ చెప్పడంతో.. ఇక లాభం లేదనుకున్న అతడి భార్య లావణ్య, ఆమె తల్లిదండ్రులు బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులతో అతడిని మందలించి పంపించాల్సిందిగా కోరారు. కానీ శుక్రవారం అతడి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోహన కృష్ణ మరణించాడని పోలీసులు తెలిపారు.
కానీ పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే అతడు మరణించాడంటూ అతడి బంధువులు శుక్రవారం అర్థరాత్రి ప్రాంతంలో బేగంపేట పోలీస్ స్టేషన్ ను ముట్టడించి ధర్నాకు దిగారు. అతడి భార్య లావణ్య మీడియాతో మాట్లాడుతూ తన భర్త చెడు దారిలో వెళ్తున్నాడని మందలించి పంపమనే తాను పోలీసులను కోరానని, కానీ ఇలా కొట్టి చంపేస్తారని అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మోహన కృష్ణ తల్లిదండ్రులు కూడా పోలీసులు కొట్టిన దెబ్బలకే అతడు మరణించినట్లు ఆరోపిస్తున్నారు.