తెలంగాణలో నివశించే కోస్తా, రాయలసీమ ప్రజలకు తాను అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ పెత్తనం వద్దని, ప్రాంతీయ పార్టీలనే ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు. హైదరాబాద్ నిజాంపేటలో జరిగిన ‘మన హైదరాబాద్- మనందరి హైదరాబాద్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారినుద్దేశించి మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనేమీ చేయలేదు.. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనిచేయవద్ద’’ని కోరారు. రెండు రాష్ట్రాల నాయకులు, పార్టీల మధ్య వైరుధ్యాలుంటాయి. కానీ వాటిని ప్రజలు, వ్యక్తులు, వ్యవస్థల మధ్య వైరుధ్యంగా చూడకూడదని హితవు పలికారు. ఇటీవల ఎన్నికల సభల్లో ఆంధ్ర ప్రాంత ప్రజల్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ పరుష వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం చేస్తున్నారని అందులో వాస్తవం లేదని చెప్పారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి తెలంగాణ తరఫున రూ.100 కోట్లు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని అయితే, ముందు కేంద్రం ఏమిస్తుందంటూ ఆయన ప్రధానమంత్రి కార్యదర్శిని ఆరా తీయగా ‘కేవలం మట్టి, నీళ్లు మాత్రమే ఇస్తున్నామ’ని అంటూ సమాధానం వచ్చిందని తెలిపారు. కేంద్రం ఇవ్వకుండా తెలంగాణ ఇస్తే వివాదం రాజుకునే ప్రమాదముందని గుర్తించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని వివరించారు. ఏపీ ప్రజలు సాదరంగా ఆహ్వానించి బ్రహ్మరథం పట్టారని ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు.