వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై దాడిని ఖండించినందుకు తనను విమర్శించడమేంటని ప్రశ్నించారు. ఏదో సామెత చెప్పినట్టు ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి, ఆయన వర్గం తమ మీద పడి ఏడవడానికి రెడీగా ఉంటారని పవన్ మండిపడ్డారు.
కాగా జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై పవన్ స్పందించారు. దాడిని ఖండించిన పవన్ ఈ చర్య అమానుషమని తెలిపారు. గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పవన్, కేసీఆర్, కేటీఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులపై విరుచుకుపడ్డారు.
తిత్లీ తుపానుతో శ్రీకాకుళం అతలాకుతలమైతే ఒక్క మాటా మాట్లాడని వీరంతా జగన్‌కు చిన్న గాయం తగలగానే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారని ఫైర్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారం వెనక ఏదో కుట్ర కోణం కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై పవన్ మండిపడ్డారు. "ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు'' ఏం జరిగినా.. మా మీద పడి ఏడుస్తారెందుకు అని ప్రశ్నించారు.