తెలంగాణ ప్రభుత్వం పైన అక్బర్ ఆగ్రహం... ఆసుపత్రులు చూశారా...

మంగళవారం, 25 నవంబరు 2014 (14:55 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారంనాడు ప్రభుత్వం పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రి, నీలోఫర్, ఉస్మానియా ఆసుపత్రిల్లో సౌకర్యాల లేమి కళ్లకుకట్టినట్లు కనబడుతోందని అన్నారు. అసలు ఆరోగ్య శాఖామంత్రి ఎన్నిసార్లు ఆ ఆసుపత్రులను సందర్శించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
ఇకపోతే సోమవారంనాడు తెలంగాణ రాష్ట్ర బీఏసీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను సభలో ప్రవేశపెట్టాలని, అందులోని అంశాలు మంత్రి హరీష్ రావు సభలో చేసిన ప్రకటనలు ఒక్కటే అయితే తాను రాజీనామా చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బురద్దీన్ ఓవైసీ వెల్లడించారు. 
 
తెలంగాణ రాష్ట్ర శాసనసభను మంత్రి టి హరీష్ రావు తప్పుడు సమాచారమిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ అంశంపై సభలో మాట్లాడనీయకపోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు. 344 నిబంధన కింద నోటీసులు ఇచ్చిన సభ్యులే మాట్లాడాలని స్పీకర్ మధుసూదనాచారి చెప్పారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఇదే నిబంధన కింద విద్యుత్ అంశంపై అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అది బీఏసీ నిర్ణయమని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు  చెప్పగా.. అది బీఏసీ నిర్ణయమైతే ఆ డాక్యుమెంటును సభలో ప్రవేశపెట్టాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. సభను మంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ అంశంపై రాజీనామాకైనా సిద్ధమని అక్బరుద్దీన్ సవాలు చేశారు.

వెబ్దునియా పై చదవండి