TRSలో చేరిన మోత్కుపల్లి.. ఒకప్పటి పరిస్థితులను గుర్తు చేసిన కేసీఆర్

సోమవారం, 18 అక్టోబరు 2021 (22:47 IST)
తెలంగాణ రాష్ట సమితి (టీఆర్ఎస్) పార్టీలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేరారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఇవాళ (సోమవారం) గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి కండువా కప్పిన.. కేసీఆర్‌ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. 
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ స‌మాజానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అని అన్నారు. మోత్కుపల్లి తనకు అత్యంత సన్నిహితుడని, ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని అన్నారు. తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నామని.. ఆనాడు విద్యుత్‌ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని కేసీఆర్‌ తెలిపారు. 
 
ప్ర‌జా జీవితంలో మోత్కుపల్లికి ఒక స్థానం ఉందని.. విద్యార్థి ద‌శ త‌ర్వాత క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చారని కేసీఆర్‌  అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ‌లందించ‌డ‌మే కాకుండా అణ‌గారిన ప్ర‌జల గొంతుగా నిలిచి త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 
 
తెలంగాణ స‌మాజం అత్యంత దారుణ‌మైన ప‌రిస్థితుల‌ను అనుభ‌వించిందని ఒకప్పటి పరిస్థితులను గుర్తు చేశారు. అప్పట్లో న‌ర్సింహులు విద్యుత్‌శాఖ మంత్రిగా ఉండగా తనను క‌లిసిన‌ప్పుడు క‌రెంట్ బాధ‌లు ఉన్నాయ‌ని చెప్పారని.. ఆలేరు అంతా క‌రువు ప్రాంతం. ఎన్ని ట్రాన్స్‌ఫార్మ‌ర్లు తీసుకొచ్చినా లాభం లేకుండా పోయింది అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు