జనగామ సమ్మక్క ఆలయంలో నరబలి...

గురువారం, 11 ఏప్రియల్ 2019 (07:49 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో నరబలి జరిగినట్టు వచ్చిన వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎవరో క్షుద్రపూజలు చేసి ఇక్కడ నరబలి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నరబలి స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
జనగామ జిల్లాలోని చిలుపూరు మండలంలోని గార్లగడ్డ తండా సమీపంలో సమ్మక్క-సారలమ్మ గద్దె ఉంది. ఇక్కడ బుధవారం ఉదయం రక్తపు మరకలు కనిపించాయి. దీంతో స్థానిక తండావాసులు ఆ పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించగా వారికి సమ్మక్క-సారలమ్మ గద్దకు సమీపంలో ఉన్న మల్లన్నగండి రిజర్వాయరులో ఓ మృతదేహం కనిపించింది. దీంతో తండావాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు, జాగిలాలతో రిజర్వాయర్ వద్దకు చేరుకుని తనిఖీ చేశారు. అలాగే, సమ్మక్క ఆలయం వద్ద ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని వయసు 45 వరకు ఉంటుందని తెలిపారు. 
 
మంగళవారం రాత్రి గద్దెల వద్ద అతడిని హత్యచేసి అనంతరం మృతదేహాన్ని రిజర్వాయర్‌లో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల లభించలేదని, దాని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన తీరును బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా నరబలే అయి ఉంటుందని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు