కరోనా చనిపోయే రోగం కాదు.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు తీస్తది: మంత్రి హరీశ్ రావు
గురువారం, 6 ఆగస్టు 2020 (07:01 IST)
"కరోనా చనిపోయే రోగం కాదు, ఆలస్యమైతే.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు తీసుకుంటుంది. సకాలంలో స్పందించి ధైర్యంగా ఉంటే కరోనా జయించడం అత్యంత సులువైన మార్గమని" రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు.
సిద్ధిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రిలో కోవిడ్-19 ల్యాబ్- కరోనా ఆర్టీపీసీఆర్ స్వాబ్ పరీక్షా కేంద్రాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇతర రోగాల కంటే కరోనా ప్రమాదకరమైంది., కాదని కేవలం ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా.. సకాలంలో అన్నీ జాగ్రత్తలు తీసుకుని చికిత్స పొందితే ఏ రకమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో మాట్లాడి రెమెడీస్ వేర్ ఇంజక్షన్లు కూడా సిద్ధిపేట జిల్లాలో అందుబాటులో పెట్టాలని కోరినట్లు, ఈ సాయంత్రంలోపు 200 మందికి సరిపడే రెమెడీస్ వేర్ ఇంజక్షన్లు సిద్ధిపేట డీఏంహెచ్ఓకు అందిస్తామని తెలిపినట్లు మంత్రి హరీశ్ వెల్లడించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కరోనా పేషెంట్లకు రెమెడీస్ ఇంజక్షన్లు ఒక్క పేషేంట్ కు ఆరు డోజ్ లు అంటే రూ.25, రూ.26 వేల రూపాయల ఖర్చుతో కూడిన కిట్లను ప్రభుత్వం తరపున ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. 200 కిట్లు జిల్లాలో అందుబాటులో పెట్టాలని కోరినట్లు, ఆరోగ్య శాఖ మంత్రి అంగీకరించి సాయంత్రంలోపు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆర్వీఎం వైద్య కళాశాలలో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, ప్రభుత్వం తరపున అన్నీ జిల్లాల్లో కూడా ఆర్టీపీసీఆర్ కేంద్రాలను ప్రారంభించనున్నదని మంత్రి తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాలు లేక హైదరాబాదు నుంచి రావాల్సిన సమయంలో కొన్ని సందర్భాల్లో ఫలితాలకు ఆలస్యం జరిగేదని, ఆ రెండు, మూడు రోజుల్లోనే కరోనా రోగి ఆరోగ్యం క్షిణించి.., వ్యాధి వ్యాప్తి జరిగి నిర్ధారణ రాకముందే కరోనా సోకిన వ్యక్తి నుంచి మరికొంత మందికి కరోనా సోకేదని మంత్రి చెప్పుకొచ్చారు.
ఇవాళ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధి ములుగులోని ఆర్వీఏంలో కేంద్రం ఏర్పాటు చేసుకున్నామని, ఐసీఏంఆర్ నుంచి అనుమతి రావాల్సి ఉన్నదని.., అనుమతి రాగానే త్వరలోనే సిద్ధిపేట వైద్య కళాశాలలో ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ప్రారంభించనున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఆధునాతన వసతులతో గజ్వేల్, మెదక్ జిల్లాలోని 50 కిలో మీటర్ల పరిధిలోని చుట్టూ పక్కల గ్రామాల్లోని ప్రజలు వచ్చి ఆర్వీఏంలో కరోనా టెస్టులు ఉచితంగా చేయించుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోవిడ్ రోగులకు ఆర్వీఏం ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రి అందుబాటులో ఉన్నదని చాలా వసతులను ఉచితంగా అందిస్తున్నారని., కరోనా రోగులను కోరేది ఎవరు కూడా కార్పొరేట్ ఆసుపత్రిల్లోకి వెళ్లొద్దని, లక్షలు ఖర్చు చేసుకోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు జిల్లాలో ర్యాపిడ్ టెస్టులకు ఐదు వేల కిట్లు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలోని అన్నీ పీహెచ్ సీ కేంద్రాలలో ర్యాపిడ్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టు చేసి రిజల్ట్స్ ఇస్తామని తెలిపారు. కరోన అనేది మనిషి చనిపోయే పెద్ద రోగం కాదు. కరోనాకు సంబధించిన ఆ లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
కరోనా అంటే మానసిక ధైర్యం కావాలి. నిర్లక్ష్యం చేస్తే కరోనా ప్రాణాలు తీసుకుంటుందని, కరోనా అంటే ఆత్మ విశ్వాసం, ధైర్యంగా ఉండాలని ప్రజలకు విశ్వాసం కలిగించేలా పిలుపునిచ్చారు. కరోనా రోగులకే కాదు., ప్రాణాలకు తెగించి కరోనా రోగులను కాపాడుతున్న వైద్యులకు, నర్సులకు అందరికీ కూడా ప్రభుత్వం రక్షణగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
కరోనా వార్డుల్లో ప్రతి రోగిని కలిసేలా డాక్టర్ల రౌండ్స్
ఆర్వీఏం వైద్య కళాశాలలోని కరోనా వార్డుల్లో రౌండ్స్ చేసి ప్రతి రోగిని కలిసి డాక్టర్లు పలకరించడం చాలా కీలకమని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వైద్యులకు సూచించారు. ప్రతి రోజూ రెండుసార్లు కరోనా రోగిని కలిస్తే వారిలో మానసికంగా ధైర్యం పెరుగుతుందని, మొక్కుబడిగా పోకుండా ఆత్మీయతతో పలకరించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు.
ప్రతి రెండు గంటలకు ఒక్కసారి స్టాఫ్ నర్సులు పర్యవేక్షణ జరపాలని, సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 6 మంది ఫిజిషియన్లు ఉన్నారని వారి ఆధ్వర్యంలో ఇదే పధ్ధతి కొనసాగుతున్నదని వివరించారు. గజ్వేల్ నియోజక వర్గానికి సమీపంలోని 50 కిలో మీటర్ల పరిధిలోని మెదక్ జిల్లా నుంచి కరోనా రోగులను ఆర్వీఏంలో తీసుకోవాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లాలో ఏంఎన్ఆర్, సిద్ధిపేట చుట్టు పక్కల జిల్లాలు, గ్రామాలు సిద్ధిపేట ఆసుపత్రిలో కరోనా చికిత్సలు అందించే అంశం పై జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాశీనాథ్, ఇతర వైద్య అధికారులతో కలిసి మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఆర్వీఏంలో చికిత్స పొందుతున్న గ్రామం వారీగా కరోనా రోగుల వివరాలు, వెంటిలేటర్ల పై చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వ్యాధి లక్షణాలు చాలా తీవ్రంగా కలిగి ఉన్న వారిని పరీక్ష పేరిట కాలయాపన చేయకుండా ఆసుపత్రిలో చేర్పించాలని, అవసరమైతే.. ర్యాపిడ్ టెస్టులు చేసి ఆసుపత్రిలో తగిన వైద్యం అందించాలని ఆర్వీఏం వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని సూచించారు. కాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో ఫోన్ లైనులో మాట్లాడారు.
సిద్ధిపేట, ఆర్వీఏంలోని కరోనా ఆసుపత్రుల్లో ప్రతి ఆసుపత్రికి వంద మంది పేషెంట్ల కోసం రెమెడీస్ ఇంజక్షన్ల బాక్సులు అందించేలా చర్యలు తీసుకోవాలని ఈటెలను కోరారు. ఈ మేరకు ఆర్వీఏం కరోనా వార్డులో కరోనా చికిత్స పొందుతున్న బాల చందర్, భాగ్యలక్ష్మీలతో ఫోను లైనులో కాసేపు సుదీర్ఘంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
ఉదయం పూట టీ, టిఫిన్ అందిస్తున్నారని, మంచి పౌష్టికాహారం, ప్రతి రోజూ ఉడక పెట్టిన గుడ్డు, కాజూ, బాదం, విటమిన్లు కలిగిన ట్యాబ్లెట్లు, తాగడానికి వేడినీళ్ళు, స్నానానికి వేడినీళ్లు అందిస్తున్నట్లు, ప్రతి గంటకు పల్స్ ఆక్సో మీటరుతో ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారని కరోనా పేషెంట్లు వివరించారు. వ్యాధి లక్షణాల పై మంత్రి ఆరా తీయగా కొద్దిగా ఉపశమనం లభించినట్లు, మరికొంత ఎగపోతగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
ఎప్పటికప్పుడు వేడినీళ్లు, గరం చాయ్ ఇవ్వాలని ఆర్వీఏం వైద్యాదికారులకు సూచనలు చేశారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఆర్ఏంఓ డాక్టర్ కాశీనాథ్, ఆర్వీఎం కళశాల ట్రస్ట్ ఛైర్మెన్ యాకయ్య, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.