సిద్ధిపేట జిల్లాలో విషాదం: ఇంట్లో చితి పేర్చుకుని కిరోసిన్ పోసుకుని..?

శుక్రవారం, 18 జూన్ 2021 (15:47 IST)
సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇంటిని, ఒంటరిగా ఉంటున్నాడనే కారణంతో అధికారులు మళ్లీ తిరిగి తీసేసుకోవటంతో వృధ్ధుడు చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తొగుట మండలం, వేములఘాట్‌కు చెందిన మల్లారెడ్డి (70) భార్య చనిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు. కూతురు కుమారుడు, అప్పుడప్పుడు తాత వద్దకు వచ్చి వెళుతూ ఉండేవాడు. మల్లారెడ్డి ఉంటున్న ఇల్లు మొత్తం మల్లన్నసాగర్ ప్రాజెక్టులో పోయింది.
 
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్‌రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఆయనకు ఇల్లు మంజూరు చేశారు. మల్లారెడ్డి అందులో జీవించసాగాడు. కానీ…. ఒంటరి వాడు అనే కారణంతో, ఇచ్చిన ఇంటిని అధికారులు వెనక్కు తీసుకున్నారు.
 
అధికారులు ఇంటిని ఖాళీ చేయించారనే కారణంతో మల్లారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం అర్ధరాత్రి తను నివాసం ఉండే ఇంట్లో చితి పేర్చుకుని… కిరోసిన్ పోసుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లారెడ్డి మనవడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు