కేసీఆర్ గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పు, తుగ్లక్ లా కాదు...

శనివారం, 3 ఆగస్టు 2019 (17:20 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను మించిపోయిందంటూ ధ్వజమెత్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల అవసరం కంటే ప్రభుత్వ ప్రచార అవసరానికే బాగా ఉపయోగపడుతుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లిని ఒక ఇరిగేషన్ జంక్షన్‌లా వాడుకుంటున్నారని ఆరోపించారు. 
 
20 టీఎంసీల సామర్థ్యంతో ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎవరు నిర్మించారో కేసీఆర్ గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పాలని నిలదీశారు. మూడు బ్యారేజీ, మూడు లిఫ్టులు కట్టి కాళేశ్వరం పూర్తైందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. 
 
కాళేశ్వరం ఒక భారమైన ప్రాజెక్టు అని తెలంగాణ ప్రజలకు అప్పులు మిగిల్చే ప్రాజెక్టు అంటూ విరుచుకుపడ్డారు. మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజీకి ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి రూ.కొటిన్నర ఖర్చైందని లెక్కల్లో చూపించిన ప్రభుత్వం వరదలు వస్తుండటంతో ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండానే రోజుకు మూడు టీఎంసీల నీరు కిందకి వదులుతున్నారని ఇదెక్కడి చోద్యం అంటూ విమర్శించారు. కేసీఆర్ ఓ తుగ్లక్ అనడానికి ఇదే ఓ నిదర్శనం అంటూ పొన్నాల మండిపడ్డారు. 
 
మరోవైపు కేసీఆర్ దాదాపు 2 దశాబ్దాలు టీడీపీలో పనిచేశారని, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా అని డిమాండ్ చేశారు. జలయజ్ఞంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 33 ప్రాజెక్టులు చేపట్టి 80 శాతం వరకు పూర్తి చేసిందని గుర్తు చేశారు. వాటిపై కేసీఆర్ చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు. ప్రాజెక్టుల వద్ద చర్చకు వస్తామంటే తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు పొన్నాల లక్ష్మయ్య. 
 
కొమురంభీం, పెద్దవాగు, ఎల్లంపల్లి, చౌటుపల్లి హనుమంతరెడ్డి, అలిసాగర్, గుత్ప, దేవాదుల, ఎస్ఎల్‌బిసి, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ ఇలా ఏ ప్రాజెక్టు దగ్గర అయినా సరే చర్చకు తాను సిద్ధమని పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు