తెలంగాణాలో కరెంట్ చార్జీల బాదుడు???

శుక్రవారం, 12 నవంబరు 2021 (11:26 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ చార్జీల బాదుడు తప్పేలా కనిపించడంలేదు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కరెంట్ ఛార్జీలు పెంచాలని డిస్కంలు ప్రభుత్వానికి తెలపడం చూస్తుంటే.. త్వరలోనే ఛార్జీల పెంపు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ఆదాయం పెరిగి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కొచ్చనేది డిస్కంల ప్లాన్.
 
రాష్ట్రంలోని రెండు డిస్కంలు ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ నష్టాలను పూడ్చేందుకు నెలకు రూ.873 కోట్లు ఇస్తోంది ప్రభుత్వం. అయినా.. యూనిట్‌‌కు సగటున 90 పైసల దాకా నష్టం వస్తున్నట్లు అంచనా. ఈ నష్టం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం నుంచి అదనపు నిధులను డిస్కంలు కోరగా అక్కడ చుక్కెదురైంది. దీంతో చార్జీలను పెంచేందుకు అనుమతించాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. 
 
గతేడాది ప్రజలకు 56,111 మిలియన్‌ యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తే డిస్కంలకు రూ.30,330 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ.. వచ్చిన దానికంటే అదనంగా రూ.9 వేల కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఈ ఏడాది కూడా ఆదాయ, వ్యయాల మధ్య లోటు నెలకు రూ.వెయ్యి కోట్ల దాకా ఉంటోందని చెబుతున్నాయి. 
 
కానీ, ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే మరిన్ని రాయితీ నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అలాగే ఒక్కో యూనిట్‌‌కు ఎంత పెంచాలనే దానిపై ఇప్పటికే డిస్కంలు కసరత్తు కూడా చేస్తున్నాయట. ఈ నెలాఖరులోగా వచ్చే ఏడాదికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌, ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు