గవర్నర్‌కి అధికారాలు బిల్లులో ఉన్నవే... అవి తప్పవు... కేంద్రం క్లియర్

శుక్రవారం, 22 ఆగస్టు 2014 (17:59 IST)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరమైన హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలోనే వుంటాయని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరించింది. 2014 ఏపీ పునర్విభజన బిల్లులో అవన్నీ పేర్కొన్నారనీ, కాబట్టి ఆ నియమనిబంధనలు, అధికారాలు గవర్నర్‌కి కట్టబెట్టామని కేంద్రంలోని మోడీ సర్కార్ మరోసారి ప్రకటించింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు మాత్రం ఖచ్చితంగా గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుంటారని కేంద్రం సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.
 
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో జరిగిన సమగ్ర సర్వేపై ఆరా తీశారు. ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ భేటీ సందర్భంగా సర్వేపై మోడీ ఆరాతీసినట్లు తెలుస్తోంది. దాదాపు అర్ధగంట పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సమగ్ర సర్వేపై మోడీ ఆరా తీసినట్లు సమాచారం.
 
హైదరాబాద్ శాంతిభద్రతలు, ఐఏఎస్ అధికారుల క్యాడర్ వర్గీకరణపై గవర్నర్-ప్రధానిల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితులపై ప్రధానికి గవర్నర్‌ వివరించారు. రెండు రోజుల నుంచీ ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి