కరోనా వ్యాపిస్తున్నా.. నిబంధనలు పాటించడంలో జనాలు వెనుకడుగు వేస్తున్నారు. తాజాగా ఓ పబ్‌కు వెళ్లిన 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ నగరంలో విచ్చలవిడి ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పబ్బులు ఇప్పుడు కరోనా హాట్‌స్పాట్‌లుగా అవతరిస్తున్నాయి. కోవిడ్ నిబంధనలను తుంగలో తొక్కుతూ కరోనా వైరస్ వ్యాప్తికి అవి కారణమవుతున్నాయి.
అందులో ఎంట్రీ అయ్యే వరకే కరోనా భయం.. లోపలికి వెళ్లాక మాస్క్, భౌతిక దూరానికి చోటు ఉండటం లేదు. యథేచ్ఛగా గుమిగూడటం.. ఒకరిని పట్టుకుని ఒకరు డ్యాన్స్ చేయడం.. పెద్దగా అరవడం.. తాగిన మైకంలో తదితర ఘటనలు సాధారణంగా జరుగుతాయి. ఫలితంగా కరోనాను ఆహ్వానించినట్టేననే విషయాన్ని ఆ సమయంలో వారు మరిచిపోతున్నారు.
రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్‌లో ఉన్న పబ్బులకు సుమారు 200ల నుంచి 300ల వరకు కస్టమర్లు వెళ్తుంటారు. ప్రస్తుతం కోవిడ్ ప్రమాదం పొంచి ఉండటంతో నిబంధనలు అమలు చేయాల్సిన పబ్బులు వాటిని గాలికొదిలేశాయి. గంటల కొద్దీ జనం పబ్బుల్లో గుమికూడుతున్నారు.
ముద్దులు, కౌగిలింతలతో కాలక్షేపం చేస్తున్నారు. స్వీయ నియంత్రణ మరుస్తున్నారు. ఫలితంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పబ్బులో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అది అందరికీ పాకుతుందని.. పబ్‌లను మూసివేయాలని డిమాండ్ పెరుగుతోంది.