రేవంత్ బిజీబిజీ... నేతలతో వరుస భేటీలు.. ఆస్పత్రిలో వీహెచ్‌కు పరామర్శ

సోమవారం, 28 జూన్ 2021 (12:51 IST)
తెలంగాణ  పీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేతలతో వరుసగా సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పొన్నాల లక్ష్మయ్యను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో క‌లిసి మాట్లాడారు. 
 
ఆ తర్వాత అనంత‌రం చిన్నారెడ్డిని కూడా రేవంత్ క‌లిశారు. అక్కడి నుంచి హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న వి.హనుమంతరావును కలిసి పరామర్శించారు. కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ వీహెచ్ రెండు రోజుల క్రితం ఆసుప‌త్రిలో చేరారు.
 
వీహెచ్‌ని క‌లిసిన‌  సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ... రాష్ట్రంలో దళితులకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న ద్రోహంపై పోరాడాలని త‌న‌కు వీహెచ్ చెప్పార‌న్నారు. హైద‌రాబాద్‌లోని పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెడితే దాన్ని పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశార‌ని ఆయ‌న చెప్పారు.
 
కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పార‌ని, ఇప్పుడు మాత్రం చిన్న విగ్ర‌హం పెట్టినా అరెస్టులు చేయిస్తున్నార‌ని మండిప‌డ్డారు. దళితులకు ఇచ్చిన ఏ హామీనీ కేసీఆర్ నెరవేర్చలేదని అన్నారు. 
 
అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వీహెచ్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శించడానికి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందన్నారు. హాస్పిటల్‌లో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై ఆయన చర్చించారన్నారు. 
 
దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ద్రోహంపై పోరాడాలని తనకు సూచించారన్నారు. పార్టీ అభివృద్ధి విషయానికి సంబంధించి కొన్ని సలహాలను ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వద్దకు కలిసి వెళదామని చెప్పారని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు