ఓటుకు నోటు కేసులా.. నోటుకు పీసీసీ సీటును అమ్మేశారు : కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

సోమవారం, 28 జూన్ 2021 (07:55 IST)
ఓటుకు నోటు కేసులా.. నోటుకు పీసీసీ కుర్చీను అమ్మేశారంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పైగా, ఇపుడది టీ పీసీసీ కాదనీ, టీడీపీ పీసీసీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా టీడీపీ మాజీ నేత ఏ.రేవంత్ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఆదివారం ఆదేశాలు జారీచేసింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకంపై పలువురు కాంగ్రెస్ పెద్దలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలాంటివారిలో సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒకరు. ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవిని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి అమ్ముకున్నారని ఆరోపించారు. 
 
పార్టీ కార్యకర్తకు టీపీసీసీ చీఫ్‌ పదవి ఇస్తారని భావించానని, కానీ.. ఓటుకు నోటు కేసు మాదిరిగానే అమ్ముకున్నారని అన్నారు. పార్టీలు మారే వారికి పదవి ఇచ్చారని, తాను పార్టీ మారలేదు కాబట్టి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఇన్‌చార్జి చేసిన రాజకీయాల వల్లనే పదవి రాలేదని, తమిళనాడులో సీట్లు అమ్ముకున్నట్లుగానే ఇక్కడ పదవులను అమ్ముకున్నారని ఆరోపించారు. 
 
పార్టీలు మారిన వారికి పదవి ఎలా వచ్చిందో అధిష్టానానికి ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. కొత్తగా పీసీసీ కార్యవర్గంలో నియమితులైన వారెవరూ తన వద్దకు రావద్దన్నారు. తాను ఇకపై గాంధీభవన్‌ మెట్లు ఎక్కేదిలేదని ప్రకటించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై ఎటువంటి విమర్శలు చేయబోనని తెలిపారు. ఇకపై పదవులతో సంబంధం లేకుండా, ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. 
 
అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే కోమటిరెడ్డికి అన్యాయం జరిగినట్టే.. తమకూ అన్యాయం చేస్తారని కార్యకర్తలు అనుకునే ప్రమాదం ఉందని, అందుకే సోమవారం నుంచి భువనగిరి, నల్లగొండ లోక్‌సభ స్థానాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తానని అన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేస్తానన్నారు. 
 
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇకపై టీటీడీపీలాగా మారుతుందని జోస్యం చెప్పారు. కొత్త కార్యవర్గం హుజూరాబాద్‌లో డిపాజిట్‌ తెచ్చుకోవాలన్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కార్యాచరణను కార్యకర్తలే నిర్ణయిస్తారని చెప్పారు. ఎల్బీనగర్‌ నుంచి ఆందోల్‌ వరకు జాతీయ రహదారిని తాను చెబితేనే మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ పార్లమెంటు చెప్పారని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు