రైళ్లలో దోపిడీకి యత్నించే దొంగలను కాల్చివేయాలని రైల్వే పోలీస్(జీఆర్‌పీ), రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్) సంయుక్త సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో రక్షణగా సాయుధ బలగాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నారు. రైళ్లలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నిరోధం, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా చర్యలు చేపట్టారు.
కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని ఆర్పీఎఫ్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్, దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్(డీఎస్సీ) సెంథిల్ కుమరేశన్ మాట్లాడారు. రాష్ట్రంలో రాత్రివేళల్లో రాకపోకలు సాగించే అన్ని ఎక్స్‌ప్రెస్, కొత్తగా ప్యాసింజర్ రైళ్లకు రక్షణగా సాయుధ బలగాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఒక్కో రైలుకు ముగ్గురు సాయుధ సిబ్బందిని నియమించామని చెప్పారు. ఎక్కడైనా రైలులో దోపిడీకి యత్నించే దొంగలను సాయుధ సిబ్బంది కాల్చివేస్తారని హెచ్చరించారు. రైళ్లలో సాయుధ రక్షణ కోసం 40 మంది అదనపు సిబ్బందిని కొత్తగా నియమించినట్లు చెప్పారు. సిగ్నల్ టాంపరింగ్‌కు అవకాశమున్న ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్‌కు జీఆర్‌పీ, ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బృందాలు అనుమానిత వ్యక్తుల కదలికలు, ముఠా సభ్యులపై నిఘా పెట్టి వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తాయన్నారు.