రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వాలతో పాటు ట్రాఫిక్ పోలీసులు ఎన్నో రకాలైన సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందుకోసం విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. అయినప్పటికీ వాహనచోదకులు అతివేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురవుతుంటారు. తద్వారా తాము ప్రమాదాలకు గురికావడమే కాకుండా, ఎదుటివారిని కూడా కష్టాలకు గురిచేస్తుంటారు. ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలైపోతున్నారు. తద్వారా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి.
తాజాగా ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి తండ్రీకూతుళ్లు ప్రాణాలు విడిచారు. ఈ షాకింగ్ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా షేర్ చేశారు. గుజరాత్లో ఇటీవల జరిగిన భయానక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇది. ఆనంద్ ప్రాంతంలో ఓ కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో అతివేగంగా వెళుతూ ఎదురుగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో బైకుపై ఉన్న భార్యాభర్తలు వారి ఐదేళ్ల కుమార్తె ఒక్కసారిగా గాల్లో ఎగిరిపడ్డారు. తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా, తల్లికి తీవ్ర గాయాలయ్యాయని సజ్జనార్ తెలిపారు. అతివేగం తెచ్చిన అనర్థం ఇదంటూ విచారం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.