జోగిపేట ఎస్ఐ వెంకటేశం వెల్లడించిన వివరాల మేరకు... బ్రాహ్మణపల్లికి చెందిన పెద్దగొల్ల పాపయ్య(60) అనే వ్యక్తికి విఠల్, నరేశ్, కృష్ణ, చిరంజీవి అనే కుమారులు ఉన్నారు. కృష్ణ వట్పల్లిలో ఉంటుండగా మిగతా ముగ్గురూ గ్రామంలోనే విడిగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు.
భార్య నాలుగేళ్ల క్రితమే మృతిచెందగా పాపయ్య పెద్ద కుమారుడు విఠల్ వద్ద ఉంటున్నాడు. తండ్రి పేరిట ఉన్న 9 ఎకరాల పొలం పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయి. పెద్దకుమారుడు విఠల్‌కు మిగతా వారికంటే కొంత భూమి ఎక్కువ ఇస్తాననని పాపయ్య చెప్పాడు. దీనికి నరేష్, కృష్ణ అభ్యంతరం చెప్పారు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి నరేష్, కృష్ణ బ్రాహ్మణపల్లికి చేరుకున్నారు. ఇంట్లోని మొదటి అంతస్తులో నిద్రిస్తున్న తండ్రి పాపయ్య వద్దకు వెళ్లి ఇటుకతో తలపై బలంగా మోదారు. కింది గదిలో పడుకున్న విఠల్ అరుపులు విని పైకి వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో తండ్రి మృతదేహం కనిపించింది. నిందితులు ఇద్దరూ పరారయ్యారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.